అష్టదిగ్భంధనంలో చంద్రబాబు

అష్టదిగ్భంధనంలో చంద్రబాబు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని గాడిలో పెట్టే పనిలో చంద్రబాబు పడ్డారు. అయితే ఆ పని అంత సులువుగా అయితే అయ్యేలా కనపడటం లేదు. చంద్రబాబు ముందున్న సవాళ్ల చిట్టా ఒకసారి పరిశీలిద్దాం :

జగన్ : జగన్ చంద్రబాబుల శత్రుత్వం గురించి కొత్తగా చెప్పటానికి ఏమీ లేదు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జగన్ మోహన్ రెడ్డి తో పోరాటం అంత ఆషామాషీ విషయం కాదు.

భాజపా/మోదీ : 2019 ఎన్నికల్లో చంద్రబాబు జగన్ కన్నా ఎక్కువ విమర్శించింది మోదినే అనటం లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ విషయం చంద్రబాబు మర్చిపోయినా మోదీ అంత తొందరగా మర్చిపోయే అవకాశం లేదు

కేసీఆర్ : 2018 లో తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో చంద్రబాబు పై కేసీఆర్ కన్నెర్ర చేశారు. వారిద్దరి మధ్య స్నేహానికి దారులు దాదాపు మూసుకు పోయినట్టే.

పవన్ : పై ముగ్గురితో పోల్చుకుంటే చంద్రబాబు పవన్ ని విమర్శించింది తక్కువ అనే చెప్పాలి. అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో స్నేహం చేయటానికి పవన్ కొంచం జంకుతున్నట్టుగా కనపడుతుంది. 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి వేచి చూసే దోరణి లో పవన్ ఉన్నారు అని అర్థం అవుతుంది.


Image

కాంగ్రెస్ : వీరిద్దరూ 2019 ఎన్నికల్లో ఒక అవగాహన తో పని చేశారు. అయితే కాంగ్రెస్ తో కలవాలనే చంద్రబాబు నిర్ణయం తెలుగుదేశం కార్యకర్తలు కొంతమందికి రుచించలేదు. అలేగే ఈ జోడీకి తెలంగాణలో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్ కి దూరంగా జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

జూ ఎన్టీఆర్ అభిమానులు : చాలా కాలంగా జూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబుపై జు ఎన్టీయార్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. లోకేష్ కి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో చంద్రబాబే జూనియర్ని దూరంగా పెట్టారు అని వారి అభిప్రాయం.

రామ్ గోపాల్ వర్మ : ఒక వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ కి ఎక్కువ విలువ లేకపోయినా అతనికి న్యూసెన్స్ వాల్యూ ఎక్కువ అనే చెప్పాలి. అతను చంద్రబాబు కి వ్యతిరేంగా సినిమాలు తీస్తూ ట్వీట్ లు వేస్తూ చికాకు పెట్టిస్తున్నాడు.

పార్టీ ఫిరాయింపులు : ఇవన్నీ కాకుండా ప్రతిపక్షంలో ఉండటం తో పార్టీ లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి.

వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు అష్టదిగ్భంధనంలో ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇన్ని సవాళ్లు ఎదురుకుని తెలుగుదేశం పార్టీని ఆయన ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీని దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న కార్యకర్తల పైనే అయన ఆశలు అన్నీ.

Comments

Popular posts from this blog

బ్రతకాలంటే మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా?

సాఫ్ట్ హిందుత్వ వద్దు ఆత్మగౌరవమే ముద్దు

తెలంగాణ రోడ్డుపై రవాణా సంస్థ